శ్రీ మాత్రే నమః

 ఓం శ్రీ మహాగణాధి పతయే నమః

 ఓం శ్రీ లలితంబికాయై నమః  

అపర శంకరుని అవతారమైన శ్రీ ఆది శంకరాచార్యుల వారు కారణ జన్ముడు. తొమ్మిది సంవత్సరాల బాల ప్రాయంలో సన్యసించి పదహారు సంవత్సరాలలోపే సర్వ శాస్త్ర పారంగతుడై వేదాంత రహస్యాలకు భాష్యాలు రాస్తూ తనకు దైవం ప్రసాదించిన మహాద్భుత కవితాశక్తితో ఆసేతు హిమాచలంలోని ప్రతి దైవీ, దేవతా క్షేత్రాలలో ఆయాక్షేత్ర పాలకులైన దైవాలనూ దేవీ మూర్తులనూ కీర్తిస్తూ, అష్టకాలు, భుజంగ ప్రయాత స్తోత్రాలు, కరావలంబ స్తోత్రాలు, మానసిక పూజ స్తోత్రాలు, సౌందర్య లహరి, శివానంద లహరి, అపరాధ క్షమాపణ స్తోత్రాలు, శివ, విష్ణు, దేవీ, గణపతి, సుబ్రహ్మణ్య ఇట్లా సర్వదేవతాస్తోత్రాలూ, భావితరాలకు, ఎవరికీ ఇష్టమైన రాగంలో వారు మనసారా పాడుకుంటూ, స్తుతించ గలిగే రీతిలో అందించిన మహానుభావుడాయన. పసి పాపాలకు కూడా ఆస్తోత్రాలు నోరు తిరిగి, కంఠస్థం అయ్యేంతటి మార్దవత, కవితామాధుర్యం ఆయనకు దైవం ప్రసాదించిన వరం. మృదు మధుర కవితా రాగ ఝరులు ఆ శ్లోకాలన్నీ. ఇక ఆదిసంకరాచార్యులు చేసిన మహాద్భుత ప్రక్రియ అనన్య సామాన్యమైనది. ఆసేతు హిమాచలం, శక్తిపీఠాలన్నిటిలోనూ శ్రీ చక్ర స్థాపన చేయటం ఆయన ప్రత్యేక కార్యక్రమం. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆయా ఋషులు, దేవతలు, మానవులు ప్రతిష్టించిన యంత్రాలలో ఉగ్రబీజాలు, (బీజాక్షరాలు) వుంటే ఆ దేవతలలో తామసిక శక్తి కూడా వుంటుంది. ఆ శక్తి స్వరూపిణులు అంతా తామస శక్తి స్వరూపిణులుగా, నర బలులు, స్వీకరించే స్థాయిలో వామాచార పూజలూ, ప్రబలమైనాయి. ఆదేవతలూ తామస రూపంతో ఆలయ ప్రాంగణం దాటి రాత్రివేళ నగర సంచారం చేస్తూ, ఉగ్ర రూపిణులుగా, మారి, పొరబాటుగా తమకు అడ్డువచ్చిన ప్రతి ప్రాణినీ ఘోరంగా బలి తీసుకోవడం, మొదలుపెట్టారు. పగలంతా సాత్విక రూపిణులుగా వుండి, సాత్విక పూజలందుకొంటున్న ఆ శక్తి రూపిణులు లయకారినులుగా మారి "అకాల ప్రళయాన్ని" సృష్టిస్తున్నారు. ఆదిసంకరాచార్యులు ఈ ఘోరబలినీ ఈ ఘోరకలినీ ఆపదలిచారు. స్వార్థ పరుల పూజావిధానాలలో జంతు బలులు, నరబలులు కొనసాగి, అమ్మవారిలో కూడా తామస శక్తి ప్రబలటాన్ని గమనించారు.  ముందు అమ్మవారిని అదుపుచేయ గలిగితే బలులిచ్చి స్వార్థ ప్రయోజనాలు తీర్చుకునే మానవుల ఆట దాpeeTaనంతట అదే ఆగిపోతుందని గ్రహించారు. ఉగ్ర బీజాలు తొలగించి సాత్విక బీజాక్షరాల శ్రీ చక్రాలనూ యంత్రాలను ఆయా పీఠాలలో ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానూ, తాను దర్శించి తరిద్దమనీ దక్షిణ పథంలోని మధుర 'మీనాక్షి'ని సందర్శించటానికి వచ్చారు. ఆ మహానుభావులకు క్షేత్రపాలకులు మీనాక్షి సుందరేశ్వరులు అష్టాదశ శక్తిపీఠములలో "మధుర మీనాక్షి" ఆలయం, పీఠమ్  ప్రముఖమైనది ! మీనములు (చేపలు) వంటి చక్కని విశాల నేత్రాలలో ఒకే ఒక మరకత శిలతో చెక్కిన అమ్మవారి విగ్రహము ఆమె అర్చామూర్తి!  ఆమెకు ''మరకతమ శ్యామ" గా పేరు తెచ్చింది. ఆకుపచ్చ నీలము అనిపించే నీలము కల గలిపిన మరకతమణి శరీర కాంతి ఆ తల్లి ప్రత్యేకత ఆమె అర్చామూర్తి "మరకత శ్యామ".
                      పాండ్య రాజ తనయ ఆ తల్లి. మధురను పాలించే పాండ్య రాజులంతా ఆ తల్లిని తమ "ఆడపడచు"గా భక్తి ప్రపత్తులతో గౌరవాభిమానములతో కొలుచుకుంటారు. ఆమె ఆజ్ఞ జవదాటరు. ఆమెను తమ కుల దేవతగా జగజ్జనని గా ఆరాధిస్తారు. పాండ్య రాజులు సౌందర్యోపాసకులు. అద్భుత శిల్ప కళా రీతులతో మధురనూ, మధుర మీనాక్షి, సుందరేశ్వరుల దేవాలయాలను తీర్చి దిద్దటమే కాక, వారు ఆడ మగ అంత ఎడమ వైపు "కొప్పు"లా కేసాల్ని చుట్టగా అందంగా అమర్చుకుంటారు. ఆ తల్లి కుడా 'వామకేశి'  ఈనాడు కొన్ని ప్రాంతాలలో ఆడవారు వారి సాంప్రదాయాలను బట్టి కుడి ఎడమలలో "కొప్పు" అమర్చుకోవటం చూస్తున్నాము ఆ కొప్పు (సిగ ముడి) ఒక ప్రత్యేకమైన అనడంకూడా. ఆకాశాన్నంటే గోపురాలతో, అంగుళం అంగుళం మహాద్భుత శిల్ప కళలో ఎందరో అజ్ఞాత యోగుల వంటి మహా శిల్పులు సృష్టించిన మహోన్నత శిల్పాలతో, తీరైన విశాలమైన నలు చదరపు వీధులు, చతురస్రాకారంలో నగర నిర్మాణం చేసి, మధ్యలో బ్రహ్మాండమైన ఆలయాలు నిర్మించి, ఒక విధంగా "దేవి భాగవత పురాణం"లో వర్ణించే మనిద్వీప వర్ణనలా రూపొందించారు. ముందు చతురస్రంలో వుండి, తర్వాత త్రికోణంలో, నిలిచి ఉండే త్రికోణ బిందు రూపిణిగా "మధుర మీనాక్షి" భాసిస్తోంది అక్కడ. అయితే అంతటి సౌందర్య రాశి, చతుష్షష్టి కళా నిలయమైన "మీనాక్షి" కూడా, రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి, ప్రాణి హింసకు పాల్పడుతోంది. పాండ్య రాజులు తమ "ఆడపడచు"లాగా తమ కుల దైవంగా, భావించే ఆ తల్లిని తమ భక్తితో ఏవిధంగాను అదుపు చేయలేక పోయారు ! ఆమెను శాంతింప చేయటానికి యావత్ భారతంలోని మూల మూలాల నుండి వేద పండితులనూ, ఋత్విక్కులనూ పిలిపించారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఉత్సవాలు, శాంతులు, జపహోమాలు, సర్వ క్రతువులూ చేయించారు. కాని అవేవి తల్లి లోని తామస శక్తిని పారద్రోల లేకపోయాయి. ఆ మంత్ర తంత్ర ద్రష్టలైన వారు కొందరు రాత్రివేళ ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా వారినీ కబలించి వేసింది మీనాక్షి! పాండ్య రాజు  ఇక నిస్సహాయముగా ఉండి పోయి తమ రాచరికపు మానవతా కర్తవ్యంగా, రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని  రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాలలో వారు బందీలుగా మారిపోయారు. ఆపద అయినా, అపాయం వచ్చినా వారిక బయటకు వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలు దేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవలసిందే!    
                     క్షేత్రపాలకుడూ, మీనాక్షి హృదయేశ్వరుడూ, జీవితేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయాడు. తన దేవేరి, దేవి అయిన మీనాక్షి తామస ప్రవృత్తిని మాన్పించటానికి ప్రస్తుతం తన కర్తవ్యం కాదు ! కార్యము కాదు ! అందుకు గానూ తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అందాక మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించు కున్నడా బోళా శంకరుడు ! తానూ ఆమెలోని మితి మించిన అహాన్ని, తామసాన్ని అదుపు చేయగలడు. ముక్కంటి అయిన తనకు సాధ్యం కానిదేది లేదు. కాని తన శరీరం లోని అర్థభాగం అయిన ఈశ్వరిని అవమాన పరిస్తే ! తనని తాను అవమానపరచుకోవటమే అవుతుంది ! బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లౌతుంది! ఆమె దేవీత్వానికి అదొక "కళంకం" కాకూడదు ! ఆ విధంగా జరగాలి కార్యక్రమం ఎలా? కాలం మహా విచిత్రమైనది ! కాలపురుషునికి "స్వ" , "పర"  భేదం లేదు. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలానికి తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా చెడు అయినా, జయమైనా, పరా జయమైనా అనుభవించి తీరాల్సిందే ! అంచేతే 'కాలాత్మ' అయిన సుందరేశ్వరుడు తగిన కాలం కోసం నిరీక్షిస్తున్నాడు. అవును మరి! ఆయన నిర్గుణ నిరంజన నిరాకర మూర్తి కదా ! సర్వజ్ఞుడు కదా ? ఆది శంకరులు మధురలో అడుగు పెట్టేనాటికి పరిస్థితి పై విధముగా ఉన్నది. పాన్ద్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి, తన అంతః పురంలో సకల సేవలు చేశాడు. భిక్ష స్వీకరించి, వారిని తరింప జేసి, "నేను మధుర మీనాక్షి ఆలయం లో ఏ రాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడా అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి ఆది శంకరాచార్య. ఈ మాటలను విన్న పాండ్య రాజు పాదాల క్రిందే భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. "వద్దు స్వామీ ! మేము చేసుకున్న పాపమేమో ఏ శాప ఫలితమో, చల్లని తల్లి, కరుణా రస సౌందర్యలహరి, అయిన మా "మీనాక్షి" తల్లి, నిశాసమయములో తామస శక్తిగా మారి, కంటికి కనిపించిన ప్రాణి నల్లా బలి తీసుకొంటోంది ! అంచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రానివిధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను ! మీరు ఆలయం లోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు ! అసలు అంతఃపురమునుండి బయటకు కూడా ఎవరూ వెళ్ళరు. నగరంలో ఏ గృహం నుండీ ఏ వ్యక్తీ బయటకు రాడు. పొరపాటుగా వస్తే వారిక మరునాటికి 'లేనట్లే' లెక్క!" అని వివరించి వేడుకున్నాడు. ఆది శంకరులు  ఈ వివరాలన్నీ వినే ఉన్నాడు. పాండ్య రాజును శత విధాలా సమాధాన పరిచాడు. "సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకీ పద్ధతి గానీ, తర్వాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు! మేము ఆలయం లోనే ఉంటాము, జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసార ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలుగదు. అందుకామె అర్చామూర్తి సన్నిధిలో ఆలయంలోనే ఉండాలి. మీరు అడ్డు చెప్పవద్దు అన్నాడు." రాజు హతాశుడైనాడు.!"  దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మ చారినిక రేపు తెల్లవారి చూడను గాక చూడను!" అని వేదన చెందాడు! ఆరాతిరి ఆయన అక్కడే ఉంటారని ఆలయ పూజారులకు చెప్పి తిరిగి అంతః పురానికి వెళ్ళాడు. ఆలయ పూజారులు కుడా సాయం సంధ్య పూజావిధానాలు పూర్తి చేసి, ఆది శంకరుల వైపు జాలి, ఆవేదన నిండిన చూపులతో పడే పడే తిరిగి చూస్తూ ఇళ్ళకు వెళ్ళిపోయారు !
                     పాండ్య రాజుకారాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది. ఆపాపం తన తర తరాలను పట్టి పీడిస్తుందేమో! ఆ బ్రహ్మచారి తన మాట మన్నించక పోయె ! ఆయనకు అడ్డు చెప్పగల శక్తీ తనకు లేకపోయే! దైవ లీల ఇట్లా వ్రాసిపెట్టి ఉన్నదా ? క్ని నిద్ర రాక అటు ఇటు పచార్లు చేయ సాగాడు. సంధ్య దాటి రాత్రి అయింది. గర్భ గుడికి ఎదురుగా వున్న విశాలమైన మండపం లో పద్మాసనం వేసుకుని, ధ్యానంలో కూర్చుండి పోయాడు ఆది శంకరాచార్య.
          "మరకత శ్యామ" అయిన ఆ తల్లి ఆయన మనో నేత్రాల యందు ప్రత్యక్షమై భ్రుకుటి మధ్య నిలచి - సహస్రారంలో ఆసీనురాలై చంద్ర కాంతి వంటి వెలుగులతో సుధా వర్షం కురిపిస్తోంది. ఆమె రూపం లలిత లలిత మనోజ్ఞంగా "శ్యామా"గా వృద్ధాప్యం రాని లేని నవ యవ్వన శృంగార లావణ్య "రససేవధి"గా భూనభోంతరాళాలు నిండి పోయింది. ఆసమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగానారభించాయి. ఆలయంలోని అన్నివైపులా వున్న దీపారాధనలలోని వెలుగులు దేదీప్యమానముగా వెలుగసాగాయి. అమ్మవారి మరకత శిల అర్చామూతిలో వేయి చంద్రకాంతి కిరణాలు మెరిశాయి. ఆ అర్చామూర్తికి చైతన్యం వచ్చినట్లుగా అమ్మవారు గర్భ గుడిలో ఆవిర్భవించింది. ఆమె మెల్లగా పీఠము పైనుండి లేచి నిల్చుంది. పాద మంజీరాలు ఘల్లు మన్నాయి !  సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణ తాటంకాలు ధగ ధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీరె, బంగారు జరీ అంచుల కుచ్చిళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెపుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆతల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానసమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నాయన దృష్టి పథంలోకి వచ్చాడు. "ఎవరీతడు ? ఈ అద్భుత తెజస్సేమిటి ? నుదుట విభూతి రేఖలు, ఫాలనేత్రం లా అందులో కుంకుమ బొట్టు, మేడలో రుద్రాక్ష మాలలతో "బాల శివుని" లా ఉన్న ఈ యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెల్లుబుకుతున్నదేమిటి?
ఈ వేళప్పుడు తన ఆలయంలో ఉన్నడేమిటి? " అనే ఆలోచనలు ఆశ్చర్యము కలిగాయి ! క్షణకాలమే ఇదంతా ! గర్భగుడి 'కడప' దాటినా ఆ తల్లి పై ఒకానొక చాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి, తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారు మబ్బు వర్ణం లోనికి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో, దిక్కులను సైతం మ్రింగివేసే భయంకర మయిన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. "మహం కాళి" స్వరూపంలా ! ఇందాకా తల్లి ఆకారం గర్భ గుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆది శంకరుల ధ్యాన సమాధి నుండీ మేల్కొని "మహా లావణ్య సేవధి" ని కళ్ళారా చూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో ఉరకలు వేస్తోంది సురగంగలా ! ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కన్పిస్తున్నది. కన్నతల్లి రూపం ఎవరూ అందమైనడా కాదా ? అనుకోరు. కన్నతల్లి కన్నతల్లె అంటే !

శ్లో||  "షడాధార పంకేరు హంత ర్విరాజ
         త్సుషుమ్నాంత రాలేతి తెజోల సంతీం
         సుధా మండలం ద్రావయంతీం, పిబంతీం
         సుధా మూర్తి మీడే! చిదానంద రూపాం ||"


(సశేషం)